పోపు దినుసుగా ప్రతి ఇంట్లో ఉండే ఆవాలు మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వీటిలో మెగ్నీషియం, కాల్సియం, మాంగనీస్, జింక్, ఒమెగా 3 ఫ్యాటియాసిడ్స్, ప్రోటీన్లు, పీచుపదార్దము ఉన్నాయి.
ఘాటైన వాసనను కలిగి ఉండే ఆవాలు ఆయుర్వేదంలో ఎంతో బాగా ఉపయోగపడతాయి. పైథోన్యూట్రియంట్లు, ఖనిజ లవణాలు, యాంటీ ఆక్సిడెంట్లు, డైటరీ ఫైబర్ ఎక్కువగా లభిస్తాయి.
ప్రతి వందగ్రాముల ఆవాలలో 9-82 గ్రా టోకోఫెనాల్ అనే పదార్థం (విటమిన్ ‘ఇ’కి సమానం) శరీరంలో కొవ్వు నిల్వలు పేరుకోకుండా సహాయపడుతుంటాయి. అందుకనే కొంచెంగా ఆవనూనెను కూరల్లో వాడుకోమని వైద్యులు సూచిస్తారు.
ఆవాల్లోని సెలీనియం రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఊపిరితిత్తుల సమస్యలను, వాపులను తగ్గిస్తుంది. పోపుల్లో వాడినప్పుడు ఆకలిని పెంచి.. ఆహారాన్ని అరిగేటట్లు చేస్తుంటాయి. గొంతునొప్పి, దగ్గు జ్వరం ఉన్నప్పుడు మరుగుతున్న నీళ్లలో చిటికెడు ఆవపోడి, తగినంత తేనె వేసి ఇస్తే సమస్యలు నియంత్రణలో ఉంటాయి.
ఘాటైన నూనెలు క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడతాయి. ఇవి రక్తప్రసరణను వేగవంతం చేస్తుంటాయి. ఆవాలను దంచి వాపుగల ప్రదేశం,
నొప్పిపైన పట్టుగా పెడితే ఉపశమనం ఉంటుంది.
అరబకెట్ వేడినీళ్లలో చెంచా ఆవాల పొడి వేసి కాళ్లను కొద్దిసేపు ఉంచితే పాదాల నొప్పులు త్వరగా తగ్గుతాయి. తెల్ల ఆవనూనె చర్మ రంగును మెరుగు పరుస్తుంది. దీన్ని శరీరానికి రాసుకొని, నలుగుపెట్టి స్నానం చేస్తే చర్మ సమస్యలు తగ్గి రంగు వస్తుంది. అలానే కొబ్బరినూనెలో ఆవనూనెను కలిపి శిరోజాలకు రాస్తుంటే ఫలితం ఉంటుంది.