శరీరంలో కొలెస్ట్రాల్‌ పెరిగితే ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శారీరక శ్రమ తగ్గడం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా ఇటీవల చాలా మంది అధిక కొలెస్ట్రాల్‌ సమస్యతో బాధపడుతున్నారు. దీంతో పెరిగిన కొవ్వును కరిగించుకునేందుకు వర్కవుట్స్‌ చేస్తున్నారు. అయితే జీవన విధానంలో చేసుకునే కొన్ని చిన్న చిన్న మార్పులతో కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ పెరిగే వేడి నీరు తాగడాన్ని అలవాటుగా మార్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో పెరిగేకొవ్వును కరిగించడంలో వేడి నీరు కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా ఉదయం లేవగానే వేడి నీటిని తీసుకుంటే మార్పు ఇట్టే కనిపిస్తుంది.

చెడు కొలెస్ట్రాల్‌కు చెక్‌ పెట్టాలంటే ఆలివ్‌ ఆయిల్‌ వాడకాన్ని పెంచాలని నిపుణులు చెబుతున్నారు. రిఫైన్డ్ ఆయిల్‌కు దూరంగా ఉండటం ఆరోగ్యానికి మంచిది. అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడం ద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించే యాంటీఆక్సిడెంట్లు ఆలివ్ నూనెలో పుష్కలంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

ఒకవేళ మీరు ప్రాసెస్ చేసిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటుంటే వెంటనే మానేయాలని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ పెరగడానికి ప్రధాన కారణం ఇదే. జంక్‌ ఫుడ్‌కు దూరంగా ఉంటూ.. సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం ద్వారా కొలెస్ట్రాల్‌ స్థాయిలు తగ్గుతాయి.

స్మోకింగ్ అలవాటు ఉంటే వెంటనే మానేయాలని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో అధిక కొలెస్ట్రాల్‌ ఉన్న వారు స్మోకింగ్ చేస్తే గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇక అన్నింటికంటే ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌కు చెక్‌ పెట్టడానికి ప్రతీ రోజూ వ్యాయామాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు. శరీరం నిత్యం ఫిట్‌గా ఉండడంతో పాటు జీవక్రియ వేగవంతం చేయడంలో వ్యాయామం కీలక పాత్ర పోషిస్తుందని అంటున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.